ముస్హఫ్లో 37వ సూరా, 182 ఆయతులు, 446వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!
2. మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా![1]
[1] ఈ ఆయత్ ఈ విధంగా కూడా వివరించబడింది. 'తరుమగొట్టే వారి సాక్షిగా!'
3. ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) పఠించే వారి (దైవదూతల) సాక్షిగా![1]
[1] ఈ ఆయత్: 'ఖుర్ఆన్ పఠించేవాని సాక్షిగా!' అని కూడా వివరించబడింది.
4. నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే![1]
[1] పై మూడు ఆయతులలో దైవదూత ('అ.స.)ల వివిధ కార్యాలు వివరించబడ్డాయి. ప్రతిదీ అల్లాహ్ (సు.తా.) యొక్క సృష్టి మరియు ఆయనకు చెందినదే. కావున ఆయన తాను కోరిన దాని ప్రమాణం చేస్తాడు. కాని మానవులకు అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరుల ప్రమాణం చేయటం నిషిద్ధం ('హరాం) ఎందుకంటే ప్రమాణం తీసుకునే దానిని సాక్షిగా తీసుకోవలసి ఉంటుంది. మానవునికి అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఉత్తమ సాక్షి లేడు. ఎందుకంటే కేవలం అల్లాహ్ (సు.తా.) యే సర్వసాక్షి.
5. ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.[1]
[1] చూడండి, 55:17. అక్కడ రెండు తూర్పులు మరియు రెండు పడమరలు అని ఉంది. అంటే చలికాలం మరియు వేసవి కాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం అయ్యే రెండు చివరలు. వాస్తవానికి సంవత్సరపు ప్రతి రోజున సూర్యుడు ఒక క్రొత్త చోటునుండి ఉదయిస్తాడు మరియు ఒక క్రొత్త చోటులో అస్తమిస్తాడు (ఫ'త్హ్ అల్-ఖదీర్).
6. నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;
7. మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి;[1]
[1] చూడండి, 15:17 నక్షత్రాల ఉనికికి మూడు కారణాలున్నాయి. 1) ఆకాశపు అలంకరణ. 2) షైతానులు ఆకాశాలలోకి పోయి దైవదూతల మాటలు వినటానికి ప్రయత్నిస్తే వాటిని తరుమటం. 3) రాత్రి చీకటిలో మానవులకు మార్దదర్శకము చేయటం. ఈ మూడు తప్ప ఇతర ఉపయోగాలు పేర్కొనబడలేదు.
8. ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి (ఉల్కలతో) కొట్టబడుతూ ఉంటారు.
9. (ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.
10. కాని, ఎవడైనా (ఏ షైతానైనా), (దైవదూతల మాటను) ఏదైనా దొంగచాటుగా ఎత్తుకుపోతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది.[1]
[1] చూడండి, 15:18.
11. అయితే వారిని అడుగు: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక మేము సృష్టించినవి (ఆకాశాలు, భూమి మొదలైనవి) దృఢమైనవా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
12. వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు.
13. మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.
14. మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు.
15. మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"
16. "ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?"
17. "ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?"
18. వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు."[1]
[1] చూడండి, 27:87 మరియు 40:60.
19. నిశ్చయంగా, అది ఒకే ఒక గద్దింపు మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.
20. మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
21. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!"[1]
[1] చూడండి, 77:13.
22. (దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని -
23. అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;
24. మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది.
25. మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు?'"
26. అలా కాదు! ఆ రోజు వారు (అవమానంతో) లొంగిపోయి ఉంటారు.
27. మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.
28. కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!"[1]
[1] అంటే ధర్మం మరియు సత్యం పేరట వచ్చేవారు. అంటే వారు ఆచరించే ధర్మమే సత్యమైనదని!
29. ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు."
30. "మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు[1]."
[1] ఇలాంటి ఆయత్ లకు చూడండి, 14:21, 40:47-48, 34:31-32, 33:67-68, 7:38-39.
31. "కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము."
32. "కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి[1]!"
[1] చివరకు వారి నాయకులు ఒప్పుకుంటారు, వారు స్వయంగా తప్పుదారిలో ఉండి, తమ అనుచరులను కూడా తప్పు దారి పట్టించారని! షై'తాన్ మాటల కోసం చూడండి, 14:22.
33. అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు.
34. నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము.
35. వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దురహంకారం చూపేవారు.
36. మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"[1]
[1] వారు దైవప్రవక్త ('స'అస) ను పిచ్చికవి మరియు దివ్యఖుర్ఆన్ ను కవిత్వము అని హేళన చేసేవారు. చూడండి, 36:69.
37. వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.
38. నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;
39. మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు -
40. ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.[1]
[1] వారికి అంటే అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న దాసులకు పదిరెట్లు పుణ్యఫలితం లభిస్తుంది. చూడండి, 6:160.
41. అలాంటి వారికి నిర్ణీతమైన జీవనోపాధి ఉంటుంది;[1]
[1] చూడండి, 2:25.
42. అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;
43. పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;
44. ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు,[1]
[1] చూడండి, 15:47.
45. వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి;
46. అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;
47. దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.
48. మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.[1]
[1] చూచూడండి, 38:52.
49. వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.[1]
[1] చూడండి, 56:34. చూఉష్టృ పక్షి (నిప్పుకోడి) తన గ్రుడ్లను భద్రంగా దాచి నందుకు అవి ఎంత సౌందర్యంగా ఉంటాయో స్వర్గపు 'హూర్ లు అలాగే ఉంటారు.
50. అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.
51. వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు;
52. అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?
53. ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
54. అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా?"
55. తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.
56. అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను దాదాపు నాశనం చేసినంత పని చేశావు!"
57. ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని."
58. (తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?
59. మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?"
60. నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).[1]
[1] అంటే తీర్పు తరువాత స్వర్గవాసులు ఎల్లప్పుడు స్వర్గంలో మరియు నరకవాసులు శాశ్వతంగా నరకంలో ఉంటారు. అప్పుడు మరణాన్ని ఒక గొర్రె ఆకారంలో తెచ్చి స్వర్గనరకాల మధ్య జిబ్ హ చేయడం జరుగుతుంది, ('హదీస్').
61. ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి.
62. ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు[1] ఆతిథ్యమా?
[1] అజ్-'జఖ్ఖూము: జముడు చెట్టు ఫలం. ఇది అరబ్ తిహామహ్ ప్రాంతాలలో ఉన్నదేనని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇది ఎంతో చేదైన దుర్వాసన గల ఫలం. ఇంకా చూడండి, 17:60, 44:43 మరియు 56:52.
63. నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.
64. నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;
65. దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి.
66. నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు.
67. తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి (త్రాగటానికి) సలసల కాగే నీటి మిశ్రమం ఉంటుంది[1].
[1] చూడండి, 47:15.
68. ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది.
69. నిశ్చయంగా, వారు తమ తండ్రితాతలను మార్గభ్రష్టులుగా కనుగొన్నారు.
70. కావున వారు కూడా వారి అడుగు జాడలలోనే త్వరపడుతూ పోయారు.
71. మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారిలో అధికులు కూడా మార్గభ్రష్టులుగానే ఉండేవారు.
72. మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.
73. ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో!
74. ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప!
75. మరియు వాస్తవంగా, నూహ్[1] మమ్మల్ని వేడుకున్నాడు. అప్పుడు చూడండి, మేము (ప్రార్థనలకు) ఎంత ఉత్తమంగా ప్రత్యుత్తరమిచ్చే వారము!
[1] నూ'హ్ ('అ.స.) గాథ కోసం చూడండి, 11:25-48.
76. మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.[1]
[1] అహ్లూన్: అంటే అతని కుటుంబం వారే కాక అతనితో బాటు విశ్వసించిన అతని అనుచరులు కూడాను.
77. మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.[1]
[1] నూ'హ్ ('అ.స.) భార్య మరియు అతని కుమారుడు విశ్వసించలేదు. కాబట్టి వారు, మునిగిపోయారు. అతని కుమారులలో 'హామ్, సామ్, యాఫస్'లు నావలో ఉన్నారు. 1) సామ్ నుండి 'అరబ్బులు, పర్షియన్లు, యూరోపియన్ లు మరియు యూదులు 2) 'హామ్ సంతతి నుండి సూడాన్, ఇండియా, 'హబషా, భిబ్తీలు మరియు బర్ బర్ లు మరియు 3) యాఫస్' సంతతి నుండి తుర్కీలు, ఖజర్, యఅ 'జూజ్ మఅ'జూజ్ మొదలైనవారు పుట్టారని చెబుతారు. (ఫ'త్హ్ అల్-ఖదీర్).
78. మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
79. సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)!
80. నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
81. నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.
82. తరువాత మేము ఇతరులను ముంచి వేశాము.
83. మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు.
84. అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;
85. అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు?
86. ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?
87. అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?"
88. ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు;[1]
[1] చూడండి, 6:76-78.
89. అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు."[1]
[1] చూడండి, 21:63.
90. కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.
91. తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి?"
92. "మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?"
93. తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు.[1]
[1] వివరాలకు చూడండి, 21:58.
94. అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు.
95. అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
96. "వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"[1]
[1] సర్వసృష్టికి మూలాధారి అల్లాహ్ (సు.తా.) మాత్రమే! కావున ఆయనను ఆరాధించకుండా మీరు మీ చేతులతో తయారు చేసిన వాటిని ఎందుకు ఆరాధిస్తున్నారు.
97. వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!"
98. కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.
99. మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు."[1]
[1] ఇబ్రాహీమ్ ('అ.స.) మొదట బాబుల్ అనే నగరంలో ఉండేవారు. అది ఇరాఖ్ లో ఉంది. ఆ తరువాత అతను షామ్ వైపునకు వెళ్ళిపోయారు.
100. (అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!"
101. కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.[1]
[1] అతను ఇబ్రాహీమ్ ('అ.స.) మొదటి కుమారుడు ఇస్మా'యీల్ ('అ.స.).
102. ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
103. ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధపడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.
104. మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్!
105. వాస్తవంగా, నీవు కలను నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.
106. నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష.
107. మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.[1]
[1] ఈ బలి ఒక గొర్రె. అది ఇస్మా'యీల్ ('అ.స.) కు బదులుగా పంపబడింది. అది బలి చేయబడింది. దీని జ్ఞాపకార్థమే ముస్లింలు ప్రతి సంవత్సరం జు'ల్ 'హజ్ లో బలి (ఖుర్బానీ) ఇస్తారు. వివరాల కోసం చూడండి, 22:27-37 మరియు 2:196-203.
108. మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.
109. "ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
110. ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
111. నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు!
112. మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.[1]
[1] ఒక కుమారుణ్ణి జి'బహ్ చేసిన గాథ తరువాత మరొక కుమారుని, ఇ'స్హాఖ్ ('అ.స.) యొక్క శుభవార్త ఇవ్వబుడుతోంది. దీనితో స్పష్టమయ్యేది ఏమిటంటే జి'బహ్ చేయబడిన కుమారుడు ఇస్మాయీల్ ('అ.స.) మాత్రమే. అప్పుడత ('అ.స.) ను ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క ఏకైక పుత్రుడు. (చూడండి, ఇబ్నె-కసీ'ర్ మరియు ఫ'తహ్ అల్-ఖదీర్).
113. మరియు మేము అతనిపై (ఇబ్రాహీమ్ పై) మరియు ఇస్ హాఖ్ పై శుభాలను (బర్కత్ లను) కురిపించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులు ఉన్నారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.[1]
[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో, ఇ'స్హాఖ్ ('అ.స.) పుట్టక ముందే, ఇబ్రాహీమ్ ('అ.స.) తన రెండవ భార్య హాజర్ మరియు ఆమె కుమారుడు ఇస్మా'యీల్ ('అలైహిమ్ స.) లను మక్కాలో వదిలారు. ఇస్మా'యీల్ ('అ.స.) అక్కడ జుర్హుమ్ అనే 'అరబ్బు తెగ స్త్రీతో వివాహం చేసుకొని అక్కడే నివసిస్తూ 'అరబ్బులలో కలిసిపోయి 'అరబ్బు అయిపోయారు. అతని వంశంలో నుండి కేవలం ము'హమ్మద్ ('స'అస) మాత్రమే ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. ఇస్హా'ఖ్ ('అ.స.) కుమారుడు య'అఖూబ్ ('అ.స.) అతని మరొకపేరు ఇస్రాయీ'ల్. అదే పేరుతో అతని కుటుంబం వారు బనీ-ఇస్రాయీ'ల్ అనబడ్డారు. అతనికి 12 మంది కుమారులు. ప్రతి కుమారుని సంతతి నుండి ఒక బనీ-ఇస్రాయీ'ల్ తెగ ఏర్పడింది. యూసుఫ్ ('అ.స.) ఆ పన్నెండు కుమారులలో ఒకరు. బనీ-ఇస్రాయీ'ల్ సంతతిలో నుండి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. మూసా మరియు 'ఈసా ('అలైహిమ్ స.) లు కూడా వారి సంతతిలోని వారే! ఈ ఇద్దరు ప్రవక్తల సంతతిలో మంచి వారు పుట్టారు. ముష్రికులు కూడా పుట్టారు. కావున కేవలం తండ్రి తాతలు పుణ్యపురుషులు అయినంత మాత్రాన సంతానంలో అందరూ పుణ్యవంతులవటం తప్పనిసరి కాదు!
114. మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము.
115. మేము వారిద్దరినీ మరియు వారి జాతి వారినీ మహా విపత్తు నుండి కాపాడాము.
116. మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.
117. మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.[1]
[1] చూడండి, 5:44.
118. మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
119. మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము.
120. "మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)!"
121. నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
122. నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.
123. మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.[1]
[1] ఇల్యాస్ (Elijah) ('అ.స.) హారూన్ ('అ.స.) సంతతి చెందిన వారు. అతని నివాసం బఅల్బక్ నగరం. ఇల్యాస్ (ఏలియా) హిబ్రూ (యూదుల) ప్రవక్త. ఇతను ఫలస్తీన్ ఉత్తర భాగంలో అహబ్ మరియు అహాజియా రాజుల కాలంలో ఉన్నారు, (దాదాపు క్రీ.శకానికి 9 సంవత్సరాలకు ముందు) ఇతని తరువాత అల్-యస'అ (Elisha,'అ.స.) ప్రవక్తగా వచ్చారు.
124. అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
125. ఏమీ? మీరు బఅల్[1] (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా?
[1] ఇల్యాస్ (Elijah 'అ.స.) కాలపు ముష్రికులు బ'అల్ అనే విగ్రహాన్ని పూజించేవారు.
126. అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా?"
127. కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు.
128. ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
129. తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
130. "ఇల్ యాసీన్[1] కు శాంతి కలుగు గాక (సలాం)!"
[1] చూఇల్-యాసీన్ (Elias), ఇల్యాస్ (Elijah) 'అ.స. పేరు యొక్క మరొక విధమైన ఉచ్ఛరణ. ఏ విధంగానేతే తూర్-సీనా, యొక్క మరొక పేరు 'తూర్-సీనీన్ ఉందో!
131. నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.
132. నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.[1]
[1] చూఖుర్ఆన్ లో ఇతర ప్రవక్తల ప్రస్తావన వచ్చినపుడు, వారిని: 'విశ్వాసులు' అని పేర్కొనబడింది. దీని ద్వారా తెలిసేది ఏమిటంటే, ప్రవక్తల ధర్మం ఏకదైవ సిద్ధాంతం - ఇస్లాం. వారు అందరూ విశ్వాసం అంటే అల్లాహ్ (సు.తా.) కు విధేయులై ఉండాలనీ, అల్లాహ్ (సు.తా.) తప్ప ఇతరులను ఆరాధించరాదని బోధించారు.
133. మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.[1]
[1] లూ'త్ ('అ.స.) గాథ కొరకు, చూడండి, 7:80-84 మరియు 11:69-83
134. ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో -
135. ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.[1]
[1] ఆమె - లూ'త్ ('అ.స.) భార్య - అవిశ్వాసులలో చేరిపోయి వెనుక ఉండి పోయింది. చూడండి, 7:83 మరియు 11:81.
136. ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము.
137. మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;[1]
[1] చూడండి, 15:76. మక్కా-సిరియా మార్గంలో ఈ నగరాలు సోడోమ్ మరియు గొమర్రాహ్ లు - ఇప్పటి మృతసముద్రం - ప్రాంతంలో ఉండేవి.
138. మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?
139. మరియు నిశ్చయంగా, యూనుస్[1] కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.
[1] యూనుస్ ('అ.స.) బైబిల్ లో యోనా (Jonah) గా పేర్కొనబడ్డారు.
140. అతను నిండు పడవ వైపుకు పారిపోయి వెళ్ళినప్పుడు;[1]
[1] అబఖ: అంటే, to escape ఒక బానిస తన స్వామిని విడిచి పారిపోవటం. యూనుస్ ('అ.స.) తన స్వామి, అల్లాహ్ (సు.తా.) అనుమతి లేనిదే తన ప్రజలను విడిచి పారిపోయారు.
141. అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.
142. ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; అప్పుడు అతను నిందార్హమైన స్థితిలో ఉన్నాడు.[1]
[1] యూనుస్ ('అ.స.) ఇరాఖ్ ప్రాంతంలో నైనవా (ఇప్పటి మో'సల్) నగరానికి ప్రవక్తగా పంపబడ్డారు. అల్లాహ్ (సు.తా.) యూనుస్ ('అ.స.) ను నైనవా ప్రజల మార్గదర్శకత్వానికి పంపాడు. వారు లక్ష లేక అంతకంటే ఎక్కువ మంది (చూడండి, 37:147). కాని వారు అతనిని విశ్వసించలేదు. అతను వారిని అల్లాహ్ (సు.తా.) శిక్ష రానున్నదనీ భయపెట్టారు. ఆ శిక్ష రాకముందే అల్లాహ్ (సు.తా.) అనుమతి లేకుండానే అతను అక్కడి నుండి పారిపోయి నావ ఎక్కారు. నావ బరువుతో మునిగి పోతుండగా, అక్కడ చీటీలు వేశారు. దానిలో అతని పేరు రాగా అతను సముద్రంలోకి దూకారు. అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది. చేప కడుపులో అతను అల్లాహ్ (సు.తా.) ను వేడుకున్నారు. అప్పుడతను బయట వేయబడ్డారు. ఇంకా చూడండి, 68:48.
143. అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే![1]
[1] అతని ప్రార్థన కోసం చూడండి, 21:87.
144. దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు.
145. ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక చౌట (బంజరు) మైదానంలో పడవేశాము.
146. మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము.[1]
[1] యఖ్'తీనున్: Gourd plant, ఆనపజాతి తీగ. అల్లాహ్ (సు.తా.) యూనుస్ ('అ.స.) ను ఏ చెట్టు చేమ లేని మైదానంలో పడవేసిన తరువాత అతని సహాయానికి ఒక ఆనప తీగను పుట్టించాడు. అదే విధంగా అల్లాహ్ (సు.తా.) కోరితే ఒక అవిశ్వాసిని విశ్వాసిగా మార్చవచ్చు! ఎప్పుడైతే అతడు హృదయపూర్వకంగా వేడుకుంటాడో.
147. మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.
148. వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.[1]
[1] చూవారు విశ్వసించిన వివరాల కోసంచూడండి, 10:98.
149. అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?[1]
[1] చూచూడండి, 16:57-59
150. లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా?"[1]
[1] చూవారు దైవదూతలలో స్త్రీలలో ఉండే లక్షణాలు ఏవైనా చూశారా? లేక మేము దేవదూతలను పుట్టించినప్పుడు వారు అక్కడ ఉన్నారా? వారిని స్త్రీలుగా పరిగణించడానికి?
151. జాగ్రత్త! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
152. "అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు!
153. ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా?[1]
[1] చూడండి, 6:100, 17:40, 53:19-22.
154. మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
155. ఏమీ? మీరు గ్రహించలేరా?
156. లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
157. మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
158. మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు.[1] కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
[1] ముష్రికుల కల్పన ఏమిటంటే అల్లాహ్ (సు.తా.) జిన్నాతులతో వివాహసంబంధం ఏర్పరచుకున్నాడు, దానితో ఆడపిల్లలు పుట్టారు, వారే దైవదూతలు అని, ఇది అసత్యం. జిన్నున్: అంటే మానవ ఇంద్రియాలకు అగోచర ప్రాణి.
159. వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)![1]
[1] చూడండి, 2:32, 6:100.
160. ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
161. ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
162. ఎవ్వడిని కూడా, ఆయన (అల్లాహ్) నుండి మరలించి మోసగించలేరు;
163. భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
164. (దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
165. మరియు నిశ్చయంగా, మేమే (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలిచే వారము.
166. మరియు నిశ్చయంగా, మేమే ఆయన పవిత్రతను కొనియాడే వారము![1]
[1] అంటే దైవదూతలు కూడా అల్లాహ్ (సు.తా.) సృష్టించిన ఆయన దాసులు. ఎల్లప్పుడూ వారు కూడా అల్లాహ్ (సు.తా.) ను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ఆజ్ఞా పాలన చేస్తూ ఉంటారు. ముష్రికులు భావించినట్లు వారు అల్లాహ్ (సు.తా.) కూతుళ్ళు కారు.
167. మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
168. "ఒకవేళ పూర్వపు జాతుల వారికి వచ్చినటువంటి హితబోధ (గ్రంథం) మా వద్ద కూడా ఉండి ఉంటే!"
169. "మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న దాసులమై ఉండేవారము!"
170. కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
171. మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా వాక్కు ముందే నిర్ధారితమై ఉంది;
172. నిశ్చయంగా, వారే సహాయం (విజయం) పొందుతారని!
173. మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని![1]
[1] చూడండి, 37:179, 58:21.
174. కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
175. మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
176. ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
177. కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
178. కావున నీవు కొంతకాలం వారిని వదలి పెట్టు;
179. మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
180. నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
181. మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
182. మరియు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు!
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.