తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్ ఖమర్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 54వ సూరా, 55 ఆయతులు, 528వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అ-నజ్మ్సూరా అర్-రహ్మాన్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు చీలిపోయాడు.[1]

[1] ఈ అద్భుత నిదర్శనం, మక్కావాసుల కోరికపై దైవప్రవక్త ('స'అస) చూపించారు. ('స. ముస్లిం)

2. అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.

3. మరియు వారు దీనిని (ఈ సూచనను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.[1]

[1] ప్రతి కార్యానికి పర్యవసానం ఉంది. అంటే మంచికి మంచి ప్రతిఫలం మరియు చెడుకు శిక్ష. ఈ ప్రతిఫలం ఈ లోకంలోనే లభించవచ్చు లేనిచో పరలోకంలో తప్పకుండా లభిస్తుంది.

4. మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.

5. పరిపూర్ణమైన వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.

6. కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;

7. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు;

8. వేగంగా పిలిచేవాని వైపునకు వేగంగా పరుగెత్తుతూ! సత్యతిరస్కారులు: "ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు.

9. వారికి పూర్వం నూహ్[1] జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు: "ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.

[1] నూ'హ్ గాథ కోసం చూడండి, 11:25-48 మరియు 26:116.

10. అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!"

11. అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.

12. మరియు భూమి నుండి ఊటలను పొంగింపజేశాము అపుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.

13. మరియు మేము అతనిని (నూహ్ ను) పలకలు మరియు మేకులు గల దాని (ఓడపై) ఎక్కించాము.

14. అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతి వారి చేత) తిరస్కరించబడిన వానికి ప్రతిఫలంగా!

15. మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?[1]

[1] ముద్దకిర్: ఈ పదం అసలు రూపం, 'మజ్'తకిర్'. అంటే హితబోధ స్వీకరించేవాడని అర్థం. (ఫత్హ్' అల్-ఖదీర్) చూడండి, 36:41-42.

16. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

17. మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

18. ఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

19. నిశ్చయంగా, మేము ఎడతెగని దురదృష్టకరమైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, వారి మీదకు తీవ్రమైన తుఫాను గాలిని పంపాము.[1]

[1] ఆ 'తుఫాను గాలి ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళు ఎడతెగకుండా వీచింది. ఆ విధంగా ఆ దినాలు, ఆ సత్య తిరస్కారులకు అశుభకరంగా పరిణమించాయి. అంతేగాని విశ్వాసులకు ఏ దినమూ అశుభం కాదు. ఏ దినాన్ని గూడా ఈ ప్రత్యేక దినం అశుభమైనదని అనటం తప్పు. వారంలోని ఏడు దినాలూ మంచివే.

20. అది ప్రజలను వేర్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్ల వలే పెళ్ళగించి వేసింది.[1]

[1] చూడండి, 69:6-8.

21. ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

22. మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

23. సమూద్ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

24. అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక మానవుణ్ణి, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?"

25. "ఏమీ? మా అందరిలో, కేవలం అతని మీదనే (దివ్య) సందేశం పంపబడిందా? అలా కాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!"

26. అసత్యవాది, డంబాలు పలికేవాడు ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!

27. నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు!

28. మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించబడింది.[1]

[1] చూడండి, 26:155 23. ఒక రోజు ఒంటెను నీరు త్రాగనివ్వాలి, రెండవ రోజు ప్రజలు త్రాగాలి.

29. ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు.[1]

[1] చూడండి, 7:77.F4881

30. అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?

31. నిశ్చయంగా, మేము వారి మీదకు ఒకే ఒక భయంకరమైన శబ్దాన్ని (సయ్ హాను) పంపాము, దాంతో వారు త్రొక్కబడిన పశువుల దొడ్డి కంచె వలే నుగ్గునుగ్గు అయి పోయారు.

32. మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

33. లూత్ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.

34. నిశ్చయంగా, మేము లూత్ ఇంటివారు తప్ప, ఇతరుల మీదికి రాళ్ళు విసిరే తుఫాన్ గాలిని పంపాము. (లూత్ ఇంటి) వారిని మేము వేకువ ఝామున రక్షించాము;[1]

[1] ఆల-లూ'తున్: అంటే అతనితో సహా అతని ఇద్దరు కూతుళ్ళు, అంటే అతని ఇంటివారు మాత్రమే. చూడండి, 51:36. అతని భార్య సత్యతిరస్కారులలో చేరిపోయింది. ఈ గాథ వివరాల కోసం చూడండి, 11:69-83.

35. మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.

36. మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!

37. మరియు వాస్తవానికి వారు అతని అతిథులను[1] అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి."

[1] వారు దైవదూతలు. వారు జిబ్రీల్, మీకాయీ'ల్ మరియు ఇస్రాఫీల్ ('అలైహిమ్ స.) లు అని కొందరు వ్యాఖ్యాతలు అంటారు. చూడండి, 11:77-79.

38. మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారి మీద పడింది:

39. "ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి."

40. మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

41. మరియు వాస్తవానికి ఫిర్ఔన్ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.

42. వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వసమర్ధుడు పట్టుకునే విధంగా!

43. (ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?

44. లేక వారు: "మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా?

45. కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందుతుంది. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.[1]

[1] దైవప్రవక్త ('స'అస) ఈ ఆయత్ ను బద్ర్ యుద్ధ ఆరంభంలో చదివారు.

46. అంతేకాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).

47. నిశ్చయంగా, పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.

48. ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; (వారితో):"నరకాగ్ని స్పర్శను చవి చూడండి!" అని అనబడుతుంది.[1]

[1] చూడండి, 33:66 మరియు 25:34.

49. నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక నిర్ణీత విధి (ఖదర్) తో సృష్టించాము.[1]

[1] అహ్లెసున్నత్ వల్-జమా'అత్ విద్వాంసులు ఈ ఆయత్ మరియు ఇటువంటి ఆయత్ ల ఆధారంగా అంటారు. అల్లాహ్ (సు.తా.)కు మానవులను సృష్టించక ముందే వారికి సంబంధించిన అన్ని విషయాల జ్ఞానముంది, కావున ఆయన అందరి 'ఖద్ర్', Destiny, విధి, అంటే విధివ్రాత నియమం లేక అదృష్టం ముందే వ్రాసి పెట్టాడు. (ఇబ్నె-కసీ'ర్).

50. మరియు మా ఆజ్ఞ కేవలం (ఒకే మాట), కనురెప్పపాటులా (అది నెరవేరిపోతుంది)[1]

[1] అల్లాహ్ (సు.తా.) ఏదైనా చేయాలనుకుంటే, దానిని: 'అయిపో!' అంటాడు. అంతే అది అయిపోతుంది. చూడండి, 2:117, 3:47, 59, 6:73, 16:40, 19:35, 36:82, 40:68.

51. మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

52. మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది.[1]

[1] చూలేక లౌ'హె మ'హ్-ఫూ''జ్ లో వ్రాయబడి ఉన్నది.

53. మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి.[1]

[1] అంటే మానవుల కర్మలూ, మాటలూ, అన్నీ వ్రాయబడి ఉన్నాయి చిన్నవి గానీ పెద్దవి గానీ, మంచివి గానీ చెడ్డవి గానీ!

54. నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.

55. సత్యపీఠం మీద[1] విశ్వసామ్రాట్టు[2] అయిన సర్వసమర్ధుని సన్నిధిలో.

[1] మఖ్'అది 'సిద్ ఖిన్: గౌరవప్రదమైన స్థానంలో - అంటే స్వర్గం. [2] చూడండి, 20:114 వ్యాఖ్యానం 1

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అ-నజ్మ్సూరా అర్-రహ్మాన్ ›