ముస్‌హఫ్‌లో 70వ సూరా, 44 ఆయతులు, 568వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. ప్రశ్నించేవాడు[1], ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;
[1] ఈ ప్రశ్నించే సత్యతిరస్కారి న'దర్ బిన్-'హారిస్' లేదా అబూ-జహల్ కావచ్చని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. చూడండి, 8:32. అతడు బద్ర్ యుద్ధంలో చంపబడ్డాడు.
2. సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.
3. అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది[1].
[1] చూడండి, 76:3.
4. యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో[1], దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[2] ఆయన వద్దకు అధిరోహిస్తారు.
[1] చూడండి, 22:47 అక్కడ నీ ప్రభువు దృష్టిలో ఒక దినము మీరు లెక్కించే వేయి సంవత్సరాలకు సమానం. ఇంకా చూడండి, 32:5. అల్లాహ్ (సు.తా.) అనంతుడు, అపారుడు, అంతులేనివాడు, కాలపరిమితికి అతీతుడు. పరలోక జీవితంలో మానవునికి కూడా కాలమనే దానికి ఎలాంటి అర్థం ఉండదు. [2] రూ'హ్: దీనిని ఇక్కడ కొందరు వ్యాఖ్యాతలు జిబ్రీల్ ('అ.స.) అన్నారు. మరికొందరు మానవుల ఆత్మలన్నారు. చూడండి, 19:17 వ్యాఖ్యానం 1.
5. కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!
6. వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు.
7. కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది.
8. ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనె వలే) అయి పోతుంది.
9. మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి[1].
[1] చూడండి, 101:5 ఇటువంటి ఆయత్ కు.
10. మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు.
11. వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;
12. మరియు తన భార్యను మరియు తన సోదరుణ్ణి;
13. మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను;
14. మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు.
15. కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)!
16. అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది.
17. అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది.
18. మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని.
19. నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు;
20. తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు;
21. మరియు తనకు మేలు కలిగినపుడు పిసినారిగా (ఇతరులకు ఇవ్వకుండా) ప్రవర్తిస్తాడు.
22. నమాజ్ ను ఖచ్ఛితంగా పాటించేవారు తప్ప!
23. ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో;
24. మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) నిర్ణీతమైన హక్కు ఉందని గుర్తిస్తారో![1]
[1] అంటే 'జకాత్ మరియు ఇతర దానధర్మాలు చేసేవారు.
25. యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి;[1]
[1] ఇటువంటి ఆయత్ కై చూడండి, 51:19.
26. మరియు అలాంటి వారు, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో;
27. మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో!
28. నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు!
29. మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -
30. తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప[1] - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.
[1] ధర్మయుద్ధం (జిహాద్)లో ఖైదీలుగా పట్టుబడ్డవారే బానిసలు, కనుక ఈ కాలంలో, ఇస్లాం నిర్దేశం ప్రకారం, బానిసలు అనబడేవారు అసలు లేరు. ఇంకా చూడండి, 23:5-7, 4:3.
31. కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు.
32. మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో;
33. మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో;
34. మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో;
35. ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు.
36. ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు?
37. కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;[1]
[1] దైవప్రవక్త ('స'అస) కాలంలో సత్యతిరస్కారులు అతని సమావేశాలలో వచ్చేవారు. కాని అతని మాటలు విని, వాటిని ఆచరించక ఎగతాళి చేస్తూ గుంపులుగా వెళ్ళి పోయేవారు. మీరు (విశ్వాసులు) కాదు మేమే స్వర్గంలోకి ప్రవేశిస్తాము, అని అనేవారు.
38. ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా?
39. అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు!
40. కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను[1]. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;
[1] చూడండి, 37:5 మరియు 55:17 తూర్పులూ మరియు పడమరలూ అంటే ఒక సంవత్సరపు కాలంలో ప్రతిరోజు సూర్యుడు ఒక కొత్త స్థానం నుండి ఉదయిస్తాడు మరియు ఒక కొత్త స్థానంలో అస్తమిస్తాడు. మరొక వ్యాఖ్యాన మేమిటంటే భూగోళంలోని విభిన్న భాగాలలో సూర్యుడు వేర్వేరు సమయాలలో వరుసగా ఉదయిస్తూ, అస్తమిస్తూ ఉంటాడు.
41. వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు.
42. కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు.
43. ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, ఏదో నిలబెట్టబడిన గుర్తు (లేక విగ్రహం) వైపునకు పరుగెత్తుతున్నట్లు వేగంగా బయటికి వస్తారు.
44. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం!
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.