ముస్‌హఫ్‌లో 77వ సూరా, 50 ఆయతులు, 580వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల, లేక సందేశహరుల సాక్షిగా అని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. 'ఉర్ ఫన్ - అంటే దివ్యజ్ఞానం (వ'హీ) లేక షరీయత్ ఆజ్ఞలని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం.
2. మరియు తీవ్రమైన వేగంతో వీచే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల సాక్షిగా! ఎవరైతే తీవ్రంగా వీచే గాలులతో సహా పంపబడతారో!
3. మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా[1]!
[1] లేక దేవదూతల సాక్షిగా!' ఇబ్నె-కసీ'ర్, 'తబరీ మరియు ఇతర చాలా మంది వ్యాఖ్యాతలు కూడా (ర హ్మ). ఈ మూడు ఆయతులలో గాలుల ప్రస్తావన ఉందనే అభిప్రాయపడ్డారు.
4. మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా[1]!
[1] లేక ఖుర్ఆన్ ఆయతుల లేక ప్రవక్తల సాక్షిగా.
5. సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూతల) సాక్షిగా![1]
[1] లేక అల్లాహ్ (సు.తా.) యొక్క వ'హీని ప్రజలకు అందజేసే ప్రవక్త ('అలైహిమ్ స.) ల సాక్షిగా! ఇమామ్ షౌకాని అభిప్రాయంలో - ముర్సలాత్, 'ఆ'సిఫాత్ మరియు నాషిరాత్ - గాలులను సంబోధిస్తున్నాయి మరియు ఫారిఖాత్, ముల్ ఖియాత్ - దేవదూతలను. ఈ వ్యాఖ్యానంతో కూడా చాలా మంది వ్యాఖ్యాతలు ఏకీభవిస్తున్నారు.
6. (ప్రజలు సాకులు చెప్పే అవకాశం లేకుండా) తుది సమర్థనగా లేక హెచ్చరికగా![1]
[1] దీని మరొక తాత్పర్యం: "(మానవులకు) ఎలాంటి సాకు మిగలకుండా చేసే ఉద్దేశంతో గానీ, లేక హెచ్చరిక చేయటానికి గానీ."
7. నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.
8. అప్పుడు ఎప్పుడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో!
9. మరియు ఆకాశం చీలిపోతుందో!
10. మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో!
11. మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో![1]
[1] చూడండి, 4:41-42, 5:109, 7:6 లేక 39:69.
12. ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?
13. ఆ తీర్పుదినం కొరకా![1]
[1] యౌముల్ ఫ'స్ల్: పునరుత్థాన దినం. ఖుర్ఆన్ అవతరరణాక్రమంలో ఇక్కడ మొదటి సారి పేర్కొనబడింది., ఇంకా చూడండి, 37:21, 44:40, 78:17 మరియు 77:38.
14. మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?
15. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది!
16. ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?
17. తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.
18. ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.
19. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
20. ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?
21. తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.
22. ఒక నిర్ణీత కాలం వరకు.
23. ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము[1].
[1] చూడండి, 23:12-14.
24. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
25. ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?
26. జీవులకూ మరియు మృతులకూను?
27. మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?
28. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
29. (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!"
30. (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;
31. కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!
32. వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది.
33. వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.
34. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
35. ఇది వారు మాట్లాడలేని దినం.
36. మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.
37. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
38. అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము!
39. కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.[1]
[1] ఇటువంటి సందేశం గల ఆయత్ కోసం చూడండి, 55:33.
40. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
41. నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.
42. మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి.
43. (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!"
44. నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
45. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
46. (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!
47. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!
48. మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.
49. ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది![1]
[1] ఈ ఆయత్ ఈ సూరహ్ లో పదిసార్లు వచ్చింది. ఏ విధంగానైతే: "అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?" అనే ఆయతు సూరహ్ అర్-ర'హ్ మాన్ (55)లో 31 సార్లు వచ్చిందో! అంటే, పునరుత్థాన దినాన్ని తిరస్కరించే వారికి వినాశం తప్పదనే విషయాన్ని అల్లాహుతా'లా మాటిమాటికి విశదీకరిస్తున్నాడు.
50. దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్ని విశ్వసిస్తారు?
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.