తర్తీల్ లోగోతర్తీల్లైవ్ రేడియో

సూరా అల్-జుమఅహ్: మూలం మరియు భావానువాదం

ముస్‌హఫ్‌లో 62వ సూరా, 11 ఆయతులు, 553వ పేజీలో ప్రారంభమవుతుంది.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అస్-సఫ్సూరా అల్-మునాఫిఖూన్ ›

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

1. ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు[1], పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయిన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.

[1] చూడండి, 20:114 వ్యాఖ్యానం 1.

2. ఆయనే ఆ నిరక్షరాస్యులైన[1] వారిలో నుండి ఒక సందేశహరుణ్ణి లేపాడు. అతను వారికి ఆయన సూచనలను (ఆయాత్ లను) చదివి వినిపిస్తున్నాడు మరియు వారిని సంస్కరిస్తున్నాడు మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు. మరియు వాస్తవానికి వారు, అంతకు పూర్వం స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉండేవారు.

[1] అల్-ఉమ్మియ్యూన: నిరక్షరాస్యులు. అంటే ఆ కాలంలో అరబ్బులలో చాలా మందికి చదవటం వ్రాయటం వచ్చేది కాదు. స్వయంగా ప్రవక్త ('స'అస) కూడా నిరక్షరాస్యులే. చూడండి, 7:157-158.

3. మరియు వారిలో నుండే, ఇంకా వారితో కలువని (తరువాత రాబోయే) ఇతరులకు కూడా (బోధించటానికి). మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

4. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మహా అనుగ్రహశాలి.

5. తౌరాత్ బాధ్యత (భారం) మోపబడిన తరువాత దానిపై అమలు చేయలేక పోయిన వారి పోలిక, పుస్తకాల భారాన్ని మోసే ఆ గాడిద వలే ఉంది. (వారు ఆ భారాన్ని భరించారే గానీ, దానిని అర్థం చేసుకోలేక పోయారు). అల్లాహ్ సూచన (ఆయాత్) లను తిరస్కరించిన వారి దృష్టాంతము ఎంత చెడ్డది. మరియు అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

6. వారితో ఇలా అను: "ఓ యూదులారా! నిశ్చయంగా, ఇతర ప్రజల కంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైన వారు (స్నేహితులు) అనే భావం మీకుంటే, మీ (వాదంలో) మీరు సత్యవంతులే అయితే మీరు చావును కోరండి.[1]"

[1] చూడండి, 5:18 మరియు 2:111.

7. కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు![1] మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.

[1] చూడండి, 2:94.

8. వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు."

9. ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు త్వరగా బయలుదేరండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది.

10. ఇక నమాజ్ పూర్తి అయిన తరువాత భూమిలో వ్యాపించండి మరియు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి మరియు మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి!

11. మరియు (ఓ ముహమ్మద్!) వారు వ్యాపారాన్ని గానీ లేదా వినోద క్రీడను గానీ చూసినప్పుడు, నిన్ను నిలబడివున్న స్థితిలోనే వదలిపెట్టి, దాని చుట్టు గుమిగూడుతారు.[1] వారితో ఇలా అను: "వినోద క్రీడల కంటే మరియు వ్యాపారం కంటే, అల్లాహ్ వద్ద ఉన్నదే ఎంతో ఉత్తమమైనది. మరియు అల్లాహ్ యే జీవనోపాధి ప్రసాదించటంలో అత్యుత్తముడు."

[1] ఒక జుము'అహ్ రోజున దైవప్రవక్త ('స'అస) జుము'అహ్ ఉపన్యాసం (ఖుత్బా) ఇస్తుంటారు. అప్పుడు ఒక వ్యాపార బృందం మదీనాలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఖుత్బా వింటున్న వారిలో నుండి చాలా మంది ఉపన్యాసాన్ని వదలి, వస్తువులు అయిపోక ముందే త్వరగా కొనుక్కుందాం అనే పేరాశతో వెళ్ళిపోతారు. కేవలం 12 మంది మాత్రమే మస్జిదులో మిగిలి పోతారు. అప్పుడు ఈ ఆయత్ అవతరింపజేయబడింది. చూడండి, 15:23.

భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)

అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.

దీని తిలావత్‌లను వినండిఈ సూరాను ముస్‌హఫ్‌లో తఫ్సీర్‌తో చదవండి‹ సూరా అస్-సఫ్సూరా అల్-మునాఫిఖూన్ ›