ముస్హఫ్లో 81వ సూరా, 29 ఆయతులు, 586వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. సూర్యుడు (అంధకారంలో) చుట్టబడి కాంతిహీనుడైనప్పుడు![1]
[1] పునరుత్థానదినమున సూర్యచంద్రులు చుట్టివేయబడతారు. ('స'హీ'హ్ బు'ఖారీ).
2. మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
3. మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1]
[1] పర్వతాలు భూమి నుండి ఊడబెరికి ఏకిన దూది వలే గాలిలో ఎగురవేయబడతాయి. చూడండి, 20:105-107 మరియు 14:48.
4. మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
5. మరియు క్రూరమృగాలన్నీ ఒకచోట సమకూర్చబడినప్పుడు![1]
[1] చూడండి, 6:38.
6. మరియు సముద్రాలు ఉప్పొంగిపోయినప్పుడు![1]
[1] ఈ ఆయత్ కు ఈ విధంగా కూడా తాత్పర్యమివ్వబడింది: "లేక సముద్రాలలో అగ్నిజ్వాలలు చెలరేగినప్పుడు".
7. మరియు ఆత్మలు (వాటి వంటి వాటితో) జతచేయబడినప్పుడు![1]
[1] దీనికి మరొక వ్యాఖ్యానం కూడా ఉంది: "ఒకే ధర్మం వారు ఒక చోట జమ చేయబడతారు. యూదులందరు ఒకచోట, క్రైస్తవులందరు ఒకచోట మరియు ముస్లింలందరు ఒకచోట."
8. మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
9. ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
10. మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు![1]
[1] కర్మపత్రాలు మరణించిన రోజు మూయబడి, పునరుత్థాన దినమున మరల తెరువబడతాయి. అప్పుడు కరపత్రాలు పుణ్యాత్ములకు కుడిచేతులలో మరియు పాపాత్ములకు ఎడమచేతులో ఇవ్వబడతాయి.
11. మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
12. మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
13. మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
14. ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
15. అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
16. (ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో![1]
[1] అల్ జవారి: నడిచేది, తిరిగేది. అల్ కున్నసి: దాక్కునేది, కనుమరుగయ్యేది.
17. మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
18. మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
19. నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు![1]
[1] అంటే జిబ్రీల్ (అ'.స.) తెచ్చిన వాక్కు.
20. అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్)[1] అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
[1] చూఅల్-'అర్షు: సింహాసనం లేక విశ్వాధికార పీఠం. ఈ పదం అవతరణలో ఇక్కడ మొదటిసారి వచ్చింది. వివరాలకు చూడండి, 7:54.
21. అక్కడ (దేవదూతలలో) అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
22. మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు![1]
[1] చూడండి, 7:184 ఈ వాక్యం మక్కావాసులతో చెప్పబడింది. ఇంకా విశదమయ్యే విషయం ఏమిటంటే దైవప్రవక్త ('స'అస) ఒక మానవుడు మరియు అల్లాహ్ (సు.తా.) ఎన్నుకొన్న ప్రవక్త.
23. మరియు వాస్తవంగా, అతను (ముహమ్మద్) ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.[1]
[1] చూడండి, 53:5 దైవప్రవక్త ('స'అస) జిబ్రీల్ ('అ.స.) ను రెండుసార్లు అతని నిజరూపంలో చూశారు. మొదటిసారి ఇక్కడ, రెండవసారి మేరాజ్ రాత్రిలో.
24. మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
25. మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
26. మరి మీరు ఎటు పోతున్నారు?
27. ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు కేవలం ఒక హితోపదేశం మాత్రమే.
28. మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
29. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.[1]
[1] ఇటువంటి మరో ఆయతు కోసం చూడండి, 76:29-30.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.