ముస్హఫ్లో 87వ సూరా, 19 ఆయతులు, 591వ పేజీలో ప్రారంభమవుతుంది.
بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
1. అత్యున్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు!
2. ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.[1]
[1] చూడండి, 82:7.
3. మరియు ఆయనే దాని ప్రకృతి లక్షణాలను నిర్ణయించాడు[1], మరియు మార్గం చూపాడు!
[1] చూడండి, 25:2 మరియు 20:50.
4. మరియు ఆయనే పచ్చికను మొలిపింప జేశాడు.
5. మరల దానిని నల్లని చెత్తాచెదారంగా చేశాడు.[1]
[1] 'గుసా'అన్: ఎండినగడ్డి. అ'హ్వా: నల్లని. అంటే పచ్చగడ్డిని ఎండింపజేసి నల్లని చెత్తాచెదారంగా చేస్తాడు.
6. మేము నీచేత (ఖుర్ఆన్ ను) చదివింప జేస్తాము, తరువాత నీవు (దానిని) మరచిపోవు -
7. అల్లాహ్ కోరింది తప్ప[1]! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు.
[1] అంటే అల్లాహ్ (సు.తా.) రద్దు చేయదలిచిన దానిని మరపింపజేస్తాడు.
8. మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము.[1]
[1] వ'హీని జ్ఞాపకముంచుకోవటం మరియు దానిపై నడవటం నీకు సులభం చేస్తాము.
9. కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; హితోపదేశం ప్రయోజనకరమైతే![1]
[1] నీ పని హితోపదేశం చేయటం మాత్రమే! నీ హితోపదేశం వారికి లాభం కావచ్చు! వారు దానితో లాభం పొందకున్నా నీ పని కేవలం హితోపదేశం చేయటమే!
10. (అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు.
11. మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు.
12. అలాంటి వాడే ఘోరమైన నరకాగ్నిలో పడి కాలుతాడు.
13. అప్పుడు, అతడు అందులో చావనూ లేడు, బ్రతకనూ లేడు.[1]
[1] చూడండి, 74:28-29.
14. సుశీలతను (పవిత్రతను) పాటించే వాడు తప్పక సాఫల్యం పొందుతాడు.
15. మరియు తన ప్రభువు నామాన్ని స్మరిస్తూ, నమాజ్ చేస్తూ ఉండేవాడు.
16. అలా కాదు! మీరు ఐహిక జీవితానికి ప్రాధాన్యత నిస్తున్నారు;
17. కాని పరలోక జీవితమే మేలైనది మరియు చిరకాలముండేది.
18. నిశ్చయంగా, ఈ విషయం పూర్వగ్రంథాలలో (వ్రాయబడి) ఉంది;
19. ఇబ్రాహీమ్ మరియు మూసాలపై (అవతరింపజేయబడిన) గ్రంథాలలో.
భావానువాదం: Telugu Translation - Abdurrahim ibn Muhammad, వెర్షన్ 1.0.9, QuranEnc.com నుండి ఎలాంటి మార్పు లేకుండా ప్రచురించబడింది. (QuranEnc.com)
అనువాదం ఖురాన్ భావాలను తెలియజేస్తుంది; అది స్వయంగా ఖురాన్ కాదు. పైన ఉన్న అరబిక్ మూలమే ఖురాన్.